అధికారులతో కలిసి సింగూరు ప్రాజెక్టు పరిరక్షణంగా మార్చడానికి క్షేత్రస్థాయి పర్యటన చేసిన మంత్రి..
ప్రాజెక్టు ఐలాండ్ లోని వాచ్ టవర్ పై రెస్టారెంట్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు కు చర్యలు..
ప్రాజెక్టు దిగువ భాగంలో 29 ఎకరాల్లో రెస్టారెంట్ ఆధునిక కాటేజీల ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించిన మంత్రి..
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ మండలం లోని సింగూర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సోమవారం సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో కలిసి మంత్రి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. సింగూర్ ప్రాజెక్టులో 50 సీట్ల కెపాసిటీ తో నడిచే రెండు అధునాతన సౌకర్యాలతో కూడిన బోట్లు ,స్పీడ్ బోట్లను ఏర్పాటు చేయాలని మంత్రి పర్యాటక, నీతిపారుదల శాఖల అధికారులను ఆదేశించారు.
సింగూర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ ,రోడ్ మ్యాప్ లను రూపొందించాలని మంత్రి టూరిజం ,ఇరిగేషన్ ,ఆర్అండ్ బి శాఖల అధికారులను ఆదేశించారు. సింగూర్ ప్రాజెక్టులో ఉన్న ఐల్యాండ్ లో వాచ్ టవర్ పైన రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ల్యాండ్ స్కేపింగ్, ఆర్ట్ స్కేపింగ్, గార్డెన్ లను అభివృద్ధి పరచాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు దిగువ భాగంలో పర్యటకులను ఆకర్షించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రాజెక్టు దికో భాగం లోని 29 ఎకరాలలో ఐదు కోట్ల రూపాయలతో అధునాతన రెస్టారెంట్, 25 అధునాతన కాటేజీలు నిర్మించాలని ఇందులో చిల్డ్రన్ ప్లే ఏరియా , ఫుడ్ కోర్ట్, గార్డెనింగ్, గ్రీనరీ, ల్యాండ్ స్కేటింగ్, పార్కింగ్ ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులు ఆదేశించారు.
నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సింగూర్ డ్యాం పై భాగంలో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. పర్యటకుల సౌకర్యం కోసం డ్యాం పై వెళ్లడానికి అవసరమైన మెట్ల నిర్మాణం డ్యాం బండ్ వెంట పార్కు అభివృద్ధి సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రాజెక్టు పరిసరాలలో సెంట్రల్ లైటింగ్ కు అవసరమైన ప్రతిపాదనలను ఫిబ్రవరి మొదటి వారం లోపు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సింగూరు ప్రాజెక్టుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాల పర్యాటకులు సింగూరు ప్రాంతం కు వచ్చేలా వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
సింగూర్ ప్రాజెక్టుకు వచ్చే పర్యాటకు లకు అధునాతన వసతులతో కూడిన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించేలా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు ప్రాజెక్టు దిగువ భాగంలో, ఐలాండ్లో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టుకు వచ్చే పర్యాటకుల సౌలభ్యం కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పెద్దపీట వేయాలని దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో పెద్దారెడ్డిపేట ఎక్స్ రోడ్డు నుండి సింగూర్ డ్యాం వరకు రహదారులుగా విస్తరణ చేపట్టాలని రహదారి వెంట అధునాతన లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అందోల్ ఆర్డిఓ పాండు, నీటిపారుదల శాఖ అధికారులు జై భీమ్, నాగరాజు ,ఆర్ అండ్ బి ఇంజనీర్లు రవీందర్ ,జగదీశ్వర్, పర్యటకశాఖ అధికారి నటరాజ్, రెవెన్యూ శాఖ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.