పుణ్య స్నానాలకు షవర్ బాతులు ఏర్పాట్లు..
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గమాత క్షేత్ర పరిసరాల్లోని మంజీరా ప్రాంతం మాఘ స్నానాలకు సిద్ధమైంది. జనమేజయుని సర్పయాగస్థలి నుంచి ప్రవహించే మంజీరా నదిలో నేడు మాఘ స్నానాలు ఆచరించేందుకు లక్షలాదిమంది భక్తులు రానున్నారు. మాఘ స్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుర్దాయంతో పాటు మంచితనం, ఉత్తమ శీలం లభిస్తాయని భావించి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాలనుండి భక్తులు పుణ్యస్నానాలకు ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాజగోపురం నుంచి ప్రధాన ఆలయం వరకు టెంట్లు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి మంజీరా నది పాయల వద్ద దాదాపు 9 బాత్ షవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నిండు కుండల వనదుర్గ ప్రాజెక్ట్..
భక్తులు పుణ్య స్నానాలు చేసుకునేందుకు సింగూరు నుంచి 0.35 టీఎంసీల నీరు ఇప్పటికే వదిలారు. సింగూరు జలాలు వనదుర్గా ప్రాజెక్టును చేరడంతో ఏడుపాయలు మంజీరా నీటితో పరవళ్ళు తొక్కుతున్నాయి. నీటి కొరత లేనందున ఈ ఏడాది భక్తులు అత్యధిక సంఖ్యలో రానున్నట్లు అంచనా. జాతరకు ఎనిమిది ఆర్టీసీ బస్సులు, అత్యవసర వైద్య సేవలకు ఒక అంబులెన్స్, ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు.
డి.ఎస్.పి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు..
మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకు మాఘ స్నానాల సందర్భంగా ఏడుపాయల దేవస్థానం పరిసరాల్లో పటిష్ట బందోబస్తు చేపడతామని మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపారు. 17 మంది ఎస్ఐలు, 33 మంది ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుళ్లు, 128 మంది కానిస్టేబుళ్లు, 41 మంది మహిళ కానిస్టేబుళ్లు, నలుగురు అత్యవసర ప్రతిస్పందన బృందం అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. భక్తులు పోలీసు సహాయం కోసం పోలీస్ క్యాంపును సంప్రదించాలని లేనిచో 100 నెంబర్ డయల్ చేయాలన్నారు.